Home జాతీయం జూదం, పందెం భోగిమంటల్లో కాలాలి.. ఆచారం, సంప్రదాయం సంక్రాంతి వేళ వెలగాలి – J7TV News

జూదం, పందెం భోగిమంటల్లో కాలాలి.. ఆచారం, సంప్రదాయం సంక్రాంతి వేళ వెలగాలి – J7TV News

by J7 TV NEWS
0 comments
జూదం, పందెం భోగిమంటల్లో కాలాలి.. ఆచారం, సంప్రదాయం సంక్రాంతి వేళ వెలగాలి


పిఠాపురంలో పవన్ కళ్యాణ్


• భావి తరాలకు సంక్రాంతి గొప్పదనాన్ని తెలిపేలా పండుగ చేసుకుందాం

• సంక్రాంతి ఉత్సవాలకు పిఠాపురం చిరునామా కావాలి

• పిఠాపురంలో పోటీ చేయడం భగవంతుడి సంకల్పం

• ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెడితే ఉపేక్షించను

• లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి

• పొత్తులను బలహీనపరిచేలా కూటమి నాయకులు మాట్లాడొద్దు

• అభివృద్ధికి కేఫ్ గా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతాను

• బూతులు తిట్టడం, కేసులు పెట్టడం తప్ప వైసీపీ చేసింది ఏమీ లేదు

• పిఠాపురంలో “పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను” ప్రారంభించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

• రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పనులకు ప్రారంభోత్సవాలు

తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో… అదే విధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. సంక్రాంతి అనేది ప్రత్యేకంగా ఒక మతానికి నిర్దేశించిన పండుగ కాదని, మన సనాతన ధర్మ మూలాల్లో చెప్పే ప్రకృతి ఆరాధన పండుగ అన్నారు. ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, వైజ్ఞానికపరమైన అంశాలు ఈ వేడుకలో దాగి ఉన్నాయని చెప్పారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. అప్యాయత, అనురాగాలకు నిలువటద్దాలు. వాటి మూలాలను, గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలను కాదని అన్నారు. మన మూలలను మనం మరిపోతే సంస్కృతి దారి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతి నుంచి… కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి అనే మాటలు పోవాలని, శ్రమైక జీవనానికి సంక్రాంతి వేదిక కావాలని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం పిఠాపురంలోని ఆర్‌ఆర్‌బి ఆర్‌బిఆర్‌ జూనియర్‌ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పిఠాపురం చాలా కీలకమైన శక్తి పీఠం. శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేల ఇది. ఏ సినిమాల్లో కూడా నటించాలి, రాజకీయాల్లో పోటీ చేయడం అనుకోలేదు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా ఊహించలేదు.

*గత దాదాపు రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు*

గత 18 నెలల్లో పిఠాపురం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. గత దాదాపు రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే… ఈ ఏడాది రూ. 211 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గత ప్రభుత్వ పాలనలో ఇంత ఖర్చు చేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నన్ను బలోపేతం చేస్తే మరింతగా పని చేస్తా. అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు ఇక్కడి ప్రజల కోసం పనిచేస్తాను. నాయకుడు అవసరం లేని వ్యవస్థను నిర్మించడమే నిజమైన అభివృద్ధి. అలాంటి అభివృద్ధి కోసమే మేమంతా శ్రమిస్తున్నాం.

*బాబాయ్ ను లేపేస్తే అది వార్త కాదు…*

పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైరల్ చేస్తున్నారు. పిఠాపురంలో చెట్టు మీద ఆకు ఊగిన, పక్షి ఈక రాలినా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో సొంత బాబాయ్‌ని చంపినా అది వార్త కాదు.. పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకున్నా అది పెద్ద వార్త అవుతుంది. ఎంతో విజ్ఞత ఉన్న రాజకీయ నాయకులే మాట అనుకుంటున్న రోజులివి. అలాంటిది చిన్న పిల్లలు ఒక మాట అనుకోరా? దానికి కులాలను మధ్యలోకి తీసుకురావాలా? గత ప్రభుత్వానికి ఒక్కటే తెలిసింది… బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేయడం. ఇప్పుడు అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దాం.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడదాం అనుకుంటే ఇక్కడ కూర్చొని ఏరివేస్తాను. శాంతి భద్రతల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలి. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కాదు. ముఖ్యమంత్రి గారు అయినా, నేను అయినా తప్పు చేస్తే శిక్షించే పరిస్థితులు ఉండాలని అసెంబ్లీలో చెప్పాం. నన్ను ఒక్క మాట అన్నా పడతాను, పార్టీని దూషించినా భరిస్తాను.. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం ఊపేక్షించను. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నా మాటలు మెత్తగా ఉంటాయి.. కానీ చాలా గట్టిగా తీసుకుంటాను.

*ఎటువంటి అరమరికలు లేవు*

ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 63.50 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తాం. ఇందుకుగానూ ప్రతి నెల రూ. 2,750 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎక్కడా హడావుడి లేకుండా ప్రతి నెల ఒకటో తేదీనే అధికారులు ప్రభుత్వ ఇళ్లకు వెళ్లి వచ్చారు. దీని కోసం గత ప్రభుత్వం మాదిరి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. మగ్గాలపై పనులు చేసే చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద 62.27 లక్షల మందికి లబ్ధి చేకూర్చాం. గత ప్రభుత్వం నాసికరం మద్యం అమ్మకాలతో రూ. 23 వేల కోట్లు దోచుకుంటే.. మా ప్రభుత్వం ఆ దోపిడీని అరికట్టి రూ. 10 వేల కోట్లు తల్లికి వందనం పథకానికి ఖర్చు చేశాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలంటే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 4 కోట్ల భోజనాలు అందించాము. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున 2.90 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 436 కోట్లు వారి ఖాతాల్లో వేశాం. జలజీవన్ మిషన్ చేస్తే గత ప్రభుత్వం నిర్వీర్యం … కూటమి పాలనలో కేంద్రాన్ని మళ్ళీ ఒప్పించి రూ. 24 వేల కోట్లు తీసుకొచ్చి పనులు ప్రారంభించాం. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు నా మధ్య ఎలాంటి అరమరికలు, విభేదాలు లేవు. పొత్తులను బలహీనపరిచేలా కూటమి నాయకులు మాట్లాడొద్దు.

• అభివృద్ధికి కేరాఫ్ గా పిఠాపురాన్ని మారుస్తాం

ఈ సంక్రాంతి సంబరాలతో పాటు మన నియోజకవర్గానికి పండుగను కూడా అందించింది. గౌరవ ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా రూ. 211 కోట్ల 72 లక్షల రూపాయల అంచనాతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం రెట్టింపు ఆనందాన్నిచ్చింది. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలంలో నాలుగు ఎకరాల స్థలంలో రూ. 9.60 కోట్ల అంచనా వ్యయంతో ఎఫ్.ఎఫ్.సి.కి శంకుస్థాపన చేశాం. ఇది ప్లగ్ అండ్ ప్లే విధానంలో దాదాపు 26 మంది మైక్రో, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు జీవనోపాధి కలిగిస్తుంది. దీని నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేసి దాదాపు 650 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇది నిర్మాణం పూర్తి అవ్వగానే ఇందులో 50 శాతం యూనిట్లు ఎస్సీ, మత్స్యకారులకు కేటాయిస్తాం. ఉప్పాడ కొత్తపల్లి కోనపాపపేట గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 2 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ ఫిషరీస్ సెంటర్ , నాలుగు డ్రై ఫిషింగ్ ప్లాట్ ఫామ్‌ను నిర్మాణం. పల్లెల్లోని ప్రాథమిక ఆరోగ్య పథకం నిధికి, ఉపాధి హామీ ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో రూ.31.21 కోట్ల అంచనా వ్యయంతో 178 మినీ గోకులాలు, 12 విలేజ్ క్లినిక్‌లు, 2 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాం. బిరుదు, భవనాల శాఖ ద్వారా చాలా సంవత్సరాలుగా దెబ్బ తిన్న ప్రధాన నిర్మాణ పనులు రూ.26. 95 కోట్లు కేటాయించాం. గొల్లప్రోలు నగర పంచాయతీలోని మురుగు సమస్య తీర్చేందుకు రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో సీసీ డ్రైన్లను నిర్మించాం. పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలకు మురుగునీటి శుద్ధి చేసి ప్లాంట్లు అందించాం. రూ. 14 కోట్ల అంచనా వ్యయంతో కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా పిఠాపురంలోని దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. రాబోయే వేసవి కాలంలో పిఠాపురం పట్టణంలో ప్రజలకు విద్యుత్తు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో రూ. 2.95 కోట్ల వ్యయంతో 33/11 కె.వి. ఎలక్ట్రికల్ సబ్ స్టేషను నిర్మించాం. పిఠాపురం పశువుల సంత ఆధునీకరణ పనులు రూ.కోటి ముప్పై ఐదు లక్షల వ్యయంతో చేశాం. వరదల సమయంలో నేను గొల్లప్రోలు నగర పంచాయతీలోని హౌసింగ్ కాలనీకి పడవలో వెళ్ళినప్పుడు వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చాను. వరదల సమయంలో కూడా రాకపోకలకు అంతరాయం లేకుండా రూ. 3.05 కోట్లతో బ్రిడ్జి నిర్మించాం. అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీలోని సూరంపేట కాలనీవాసులకు కూడా వరదల సమయంలో వారి రాకపోకలకు తీవ్ర అవస్థలు ఏర్పడుతున్నాయనే అంశం నా దృష్టికి రావడంతో ఇరవై లక్షల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేశాం. పీఎం శ్రీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల గొల్లప్రోలులో రూ.1.15 కోట్ల వ్యయంతో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ నిర్మించాం. పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాను. మొదటి ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో రూ. 308 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. ఇప్పుడు మరో రూ. 211 కోట్లతో చేపట్టబోతున్నాం.

• దేశంలోనే అత్యుత్తమ యుద్ధ విద్యాల అకాడమీ పిఠాపురంలో ఏర్పాటు చేస్తాం

పిఠాపుర దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం. వచ్చే మూడున్నరేళ్లు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపడతాం. పిఠాపురంలో రోడ్డు సౌకర్యం లేని గ్రామం ఉండకూడదు. ఏ రోడ్డుపై కూడా గుంతలు కనబడకూడదు. ముంపు అన్న మాట వినబడకూడదు. అదే నా లక్ష్యం. ఇండియాలోనే అత్యున్నతమైన యుద్ధకళల అకాడమీని పిఠాపురంలో ఏర్పాటు చేస్తాం. యువత మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.

మంగళగిరి పార్టీ కార్యాలయం అడ్మినిస్టేషన్ హెడ్ క్వార్టర్ అయితే… ఐడిలాజికల్ హెడ్ క్వార్టర్ మాత్రం పిఠాపురమే. ప్రతి ఏడాది ఈ నియోజకవర్గంలోనే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు చేయాలని నిర్ణయించుకున్నామ”న్నారు.

You may also like

Leave a Comment

J7 TV NEWS delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, J7 Tv NEWS is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird